ములుగు జిల్లా వాజేడు మండలం లోని తెలంగాణ ‘నయాగార’గా గుర్తింపు పొందిన అందాల బొగత జలపాతం పరవళ్లు తొక్కుతోంది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో జలపాతం ఉరకలెత్తుతోంది. ఆ అందాలను కనులారా చూసేందుకు పర్యాటకులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ములుగు జిల్లా వాజేడు మండలం చీకుపల్లిలో ఈ జలపాతం ఉంది. ఎగువన చతిస్గడ్ లో కురుస్తున్న భారీ వర్షాలకు కొండలు కోనల వాగులు, వంకలు నడుమ పొంగిపొర్లుతున్నాయి. ఈ క్రమంలో బొగత జలపాతానికి వరద ప్రవాహం పెరిగింది.
దట్టమైన అడవిలో జలపాతం సవ్వడులు వీనుల విందు చేస్తున్నాయి. బొగత జలపాతం సరికొత్త అందాలతో అలరిస్తోంది. పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తోంది.రద్దీ బాగా పెరిగిపోయింది. విద్యార్థులు, ఉద్యోగులు, యువతీ యువకులు పిల్లా పాపలతో పెద్ద సంఖ్యలో వస్తున్నారు,సుమారు 50 అడుగుల ఎత్తు నుంచి నీరు జాలువారుతుంటే పర్యాటకులు కేరింతలు కొడుతూ సెల్ఫీలతో ఫోటోలు దిగుతు ఎంజాయ్ చేస్తున్నారు దిగువకు చేరిన నీటిలో జలకాలాడుతూ నీళ్లలో నుంచి బయటికి రావాలనిపించడంలేదు అని చెప్తున్నారు కొంత మంది సరదాగా గడుపుతున్నారు. ప్రకృతి అందాలను ఆస్వాదిస్తున్నారు. హైదరాబాద్, ఖమ్మం, వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, అలాగే మహారాష్ట్ర తదితర రాష్ట్రాల నుంచి కూడా పర్యాటకులు వస్తున్నారు. వేలాది మంది పర్యాటకులతో జలపాతం పరిసర ప్రాంతాలు సందడిగా మారింది.