ఆకస్మిక వర్షాలతో కాస్త వాతావరణం చల్లబడిందని జనాలు ఇలా అనుకున్నారో లేదో.. అలా ఎండలు మళ్లీ ఠారెత్తిస్తున్నాయి. ఏపీవ్యాప్తంగా ఎండలు దంచికోడుతున్నాయి. పగటిపూట ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగాయి. రోహిణి కార్తెతో జనం హడలెత్తిపోతున్నారు. అయితే ఈలోపే ఏపీ ప్రజలకు వాతావరణ శాఖ మరోసారి గుడ్ న్యూస్ అందించింది. శనివారం నుంచి మూడు రోజులు రాష్ట్రంలో వర్షాలు పడే అవకాశముందని పేర్కొంది. రెండు రోజుల్లో నైరుతి రుతుపవనాలు రాష్ట్రవ్యాప్తంగా వ్యాపించనున్నాయంది.
రేపు విజయనగరం, పార్వతీపురంమన్యం, అల్లూరి సీతారామరాజు, శ్రీ సత్యసాయి, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
శ్రీకాకుళం, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, బాపట్ల, ప్రకాశం, కర్నూలు, నంద్యాల, అనంతపురం జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముంది.
విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు మరియు నెల్లూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది.
మరోవైపు విజయనగరంలో 6 మండలాలు, పార్వతీపురంమన్యంలో 9 మండలాల్లో తీవ్ర వడగాల్పులు వీచే ఛాన్స్ ఉంది. ఇక శ్రీకాకుళంలో 10, విజయనగరంలో 18, పార్వతీపురంమన్యంలో 5, విశాఖపట్నంలో 1, అనకాపల్లిలో 7, అనంతపురంలో 2 వడగాల్పులు వీచే అవకాశముందని.. ప్రజలు పలు జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ అధికారులు సూచించారు.