మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని రడగంబాల బస్తీ కి చెందిన మంతెన భాగ్యలక్ష్మి(48) అనే మహిళ వాంతులు, విరోచనాలతో అనారోగ్యంతో బాధపడుతుండడంతో కుటుంబ సభ్యులు నిన్న ఉదయం 11 గంటలకు బెల్లంపల్లిలోని వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రిలో అడ్మిట్ చేయడం జరిగింది.
ఉదయం 11 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు ఆసుపత్రిలో చికిత్స అందించగా రాత్రి 9 గంటల తర్వాత నైట్ డ్యూటీ లో ఉన్న నర్స్ వారు ఆమెకు ఆంటిబయాటిక్ ఇంజక్షన్ వేసారు. వెంటనే భాగ్యలక్ష్మి నాకు ఏదోలాగా అవుతుందని డ్యూటీ నర్స్ వారికి చెప్పడంతో హుటాహుటిన ఆమెకు అమర్చిన సెలైన్ తీసివేసి, కింద ఉన్న ఎమర్జెన్సీ వార్డుకి షిఫ్ట్ చేసి, డ్యూటీ డాక్టర్ సమాచారం ఇచ్చారు. అప్పటికే ఆమెకు శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారడంతో డ్యూటీ నర్స్, డాక్టర్స్ సిపిఆర్ చేసి, నోటిలో పైపు వేసి ఆక్సిజన్ అందించడానికి ప్రయత్నం చేసిన లాభం లేకుండా పోయింది. ఆమె ప్రాణాలు వదిలేసింది.
దీంతో ఇంజక్షన్ వేసిన తర్వాతనే ఆమె చనిపోయిందని పక్కన ఉన్న బెడ్ వారు వారి కుటుంబ సభ్యులకు తెలియజేశారు. నైట్ డ్యూటీ లో ఉన్న డాక్టర్ సునీల్ ను వివరణ అడగగా శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా ఉందని నర్స్ చెప్పడంతో హుటాహుటిన ఆమెకు శ్వాస అందించిన ప్రాణాలు దక్కలేదని చెప్పారు. ఇంజక్షన్ వేయడం వల్లే ఆమె ప్రాణాలు కోల్పోయిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారని అడగగా పోస్ట్ మార్టం రిపోర్టులో తెలుస్తుందని వివరణ ఇచ్చారు.
బెల్లంపల్లి పట్టణంలో గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన వంద పడక ఆసుపత్రిలో వైద్యులు, సిబ్బంది, పరికరాలు అరకొరగా ఉండడంతో, ఆసుపత్రిలో రోగులకు కనీస వైద్యం అందకపోవడం విమర్శలకు దారి తీస్తుంది. అడ్మిట్ అయినా రోగులే లేచి ప్రత్యక్షంగా చెబుతున్న మాటలు, ఇక్కడ సరిగా వైద్యం అందడం లేదని, వైద్యులు నిర్లక్ష్యం చేస్తున్నారని, డ్యూటీ నర్సులు వారిష్టారీతిలో వ్యవహరిస్తున్నారని, బాధ చెప్పినా పట్టించుకోవడంలేదని ఆరోపిస్తున్నారు. వెంటనే వంద పడకల ఆసుపత్రిలో సరిపోయే వైద్యులు, సిబ్బంది నియమించాలని స్థానికులు కోరుతున్నారు.