వ్యవసాయానికి కరెంటు, నీళ్లు ఇవ్వకుండా అన్నదాతను ఏడిపించిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు పండించిన వడ్లు కొనకుండా గోస పెడుతున్నది. కొనుగోలు కేంద్రాల్లో వడ్ల బస్తాలు పేరుకుపోయి, వానకు తడుస్తుంటే పట్టించుకోని సర్కారు తీరు చూసి గుండెమండిన అన్నదాతలు బుధవారం రోడ్డెక్కి ఆందోళనకు దిగారు.
ధాన్యం కొనాలంటూ రాష్ట్రవ్యాప్తంగా రైతులు నిరసనలకు దిగారు. ఈ నేపథ్యంలో రైతులను గోసపుచ్చుకుంటున్న సర్కారుకు వ్యతిరేకంగా నిరసనలకు బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ పిలుపునిచ్చారు. గురువారం అన్ని అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టాలంటూ గులాబీ సైనికులకు పిలుపునిస్తూ బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు.
రైతుల పక్షాన నిలబడాలని బీఆర్‌ఎస్ శ్రేణులను కోరారు. రైతాంగానికి భరోసా కల్పించే దిశగా నిరసన కార్యక్రమాలతోపాటు ప్రతిరోజూ వడ్ల కల్లాల వద్దకు వెళ్లి రైతులకు అండగా నిలవాలని సూచించారు. రైతుల హకులను కాపాడేందుకు, వారికి అండగా నిలిచేందుకు బీఆర్‌ఎస్ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని కేసీఆర్ స్పష్టం చేశారు.
అవసరం తీరంగనే నాలుక మడత
లోక్‌సభ ఎన్నికలు ముగిసీ ముగియగానే బోనస్‌పై నాలుక మర్లేసిన కాంగ్రెస్‌పై కేసీఆర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. పోలింగ్ ముగిసిన తెల్లారే వడ్లకు రూ.500 బోనస్ ఇస్తామని ప్రకటించిన ప్రభుత్వం ఇప్పుడు సన్నవడ్లకే బోనస్ అంటూ చేసిన ప్రకటనపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కాంగ్రెస్ రైతు వ్యతిరేక విధానాలను ఖండిస్తున్నట్టు చెప్పారు.
మాటమార్చిన సర్కారుపై పిడికిలెత్తారు. పార్లమెంటు ఎన్నికలు ముగిసిన మర్నాడే వరికి క్వింటాలకు రూ. 500 బోనస్ ఇస్తామని ప్రకటించిన ప్రభుత్వం, ముఖ్యమంత్రి ఇప్పుడు సన్నవడ్లకు మాత్రమే బోనస్ ఇస్తామంటూ రైతాంగాన్ని వంచించారని, మోసం చేశారని, దగాచేశారని దుయ్యబట్టారు. రాష్ట్రంలో 90 శాతం మంది రైతులు దొడ్డురకం వడ్లనే పండిస్తారని, ఈ విషయం తెలిసి కూడా సన్నవడ్లకే బోనస్ ఇస్తామని ఎట్లా ప్రకటిస్తారని నిలదీశారు. ‘ఓట్లు డబ్బాలో పడంగనే కాంగ్రెస్‌కు రైతుల అవసరం తీరింది.
అందుకే నాలిక మర్లేసి ఎప్పటి మాదిరిగానే నయవంచనకు పూనుకున్నది. సన్నవడ్లకు మాత్రమే అనేమాట ఎన్నికలకు ముందు చెప్పి ఉంటే కాంగ్రెస్ పార్టీని రైతులు తుక్కుతుక్కు చేసేవాళ్లు. ప్రజలు ఇప్పటికీ ఆగ్రహంతో ఉన్నారు. రైతుబంధు ఇయ్యక, రైతు భరోసా ఇయ్యకుండా రైతాంగాన్ని అన్నిరకాలుగా కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తున్నది. రైతాంగ హకులను, హామీలను సాధించేందుకు బీఆర్‌ఎస్ రాష్ట్రవ్యాప్తంగా నిరసన చేపడుతున్నది’ అని కేసీఆర్ స్పష్టం చేశారు.