ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్రహోంమంత్రి అమిత్ షాలను తాను సూటిగా ప్రశ్నిస్తున్నానని… రిజర్వేషన్లపై మీ పార్టీ ఆలోచన ఏమిటో చెప్పండి? అని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. బుధవారం ఆయన హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ… రిజర్వేషన్లను రద్దు చేయాలన్నదే ఆరెస్సెస్ మూల సిద్ధాంతమని… దానిని అమలు చేయడానికి బీజేపీ ప్రయత్నిస్తోందన్నారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లను రద్దు చేయాలన్నదే వారి అజెండా అని ఆరోపించారు. దేశస్థాయిలో రిజర్వేషన్ల అంశం చర్చకు రావడంతో బీజేపీ కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేసిందన్నారు. అందులో భాగంగానే ఢిల్లీలో కేంద్ర హోంశాఖ ఫిర్యాదు చేసిందన్నారు.
గతంలో మీ మంత్రులు చేసిన వ్యాఖ్యలపై ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. 2002లోనే జస్టిస్ వెంకటాచలయ్య కమిషన్ వేశారని, వారు రిజర్వేషన్లపై నివేదిక ఇచ్చారని తెలిపారు. ఆ నివేదికను సీక్రెట్‌గా పెట్టారని ఆరోపించారు. 2024 ఎన్నికల్లో తాను బీజేపీ సీక్రెట్ అజెండాను బయటపెట్టానన్నారు. రిజర్వేషన్లు ఇచ్చిన పార్టీ ముఖ్యమంత్రిగా వాటిని కాపాడాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు. ఎన్నికల్లో నెగ్గేందుకు ఢిల్లీ పోలీసులను తమపై ప్రయోగిస్తున్నారన్నారు. ఢిల్లీ సుల్తానులకు తాను లొంగిపోతానని అనుకుంటున్నారా? అని ప్రశ్నించారు. బలహీనవర్గాలకు అండగా ఉండకుండా తాను బీజేపీకి లొంగిపోతాననుకుంటున్నారా? అని మండిపడ్డారు.
వాజపేయి ఉన్నప్పుడు ఓ గెజిట్ ఇచ్చారని, నాటి రాష్ట్రపతి కేఆర్ నారాయణన్ రిజర్వేషన్ల రద్దు గురించి మాట్లాడిన తర్వాత నోటిఫికేషన్ ఇచ్చారని సీఎం పేర్కొన్నారు. రాజ్యాంగాన్ని మార్చడానికి చేస్తున్న ప్రయత్నంలో భాగంగానే నాడు ఆ గెజిట్ ఇచ్చారని ఆరోపించారు. 2002లో రాజ్యాంగ సవరణపై నివేదిక ఇచ్చారన్నారు. 2004లో ప్రజలు బీజేపీని తిరస్కరించడంతో రిజర్వేషన్లు ఎత్తివేసే ప్రమాదం తప్పిందని సంచలన ఆరోపణలు చేశారు.
రిజర్వేషన్ల రద్దుపై ఆధారాలతో సహా తాను వాదిస్తున్నానని తెలిపారు. తన వాదనలపై సరైన వివరణ ఇచ్చుకోవాల్సిన బాధ్యత మోదీ, అమిత్ షాలపై ఉందన్నారు. బీజేపీ ఎన్నికల్లో గెలవడానికి ఈడీ, సీబీఐ, ఢిల్లీ పోలీసులను వాడుకుంటోందని మండిపడ్డారు. బీజేపీ కుట్రలను తిప్పికొట్టడానికి తప్పకుండా పోరాడుతానన్నారు.