శ్రీరామ నవమి వచ్చిందట భద్రాద్రి కళకళలాడుతుంది. భద్రగిరి మొత్తం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంటుంది. సీతా లక్ష్మణ సమేత శ్రీరామచంద్రుడిని దర్శించుకునేందుకు భక్తులు లక్షలాదిగా తరలి వస్తారు. ప్రతి ఏడాది ఆనవాయితీ ప్రకారం తెలంగాణ ప్రభుత్వం రాములవారి కల్యాణానికి పట్టు వస్త్రాలు సమర్పిస్తుంది. అలాగే ముత్యాల తలంబ్రాలు కూడా అందిస్తుంది. ఈ కార్యక్రమాన్ని చూసేందుకు భద్రాద్రి వరకు రాలేని భక్తుల కోసం ప్రత్యక్ష ప్రసారం చేస్తుంది. ఆ కార్యక్రమాన్ని అనేకమంది తమ ఇళ్ల నుండే వీక్షించి తరిస్తూ ఉంటారు. ఇక రాములోరి కళ్యాణం కేవలం భద్రాద్రిలో మాత్రమే జరుగుతుంది అనుకుంటే పొరపాటే, ఈ ఉత్సవం పట్టణాలు పల్లెలు అనే తేడా లేకుండా అన్ని ప్రాంతాల్లో అంగరంగ వైభవంగా జరుగుతుంది. అయితే ప్రతి సంవత్సరం తెలంగాణ ముఖ్య మంత్రి హోదాలో ఉన్న వ్యక్తి రాముల వారికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు తీసుకు వెళతారు. కానీ ఈ ఏడాది మాత్రం తెలంగాణలో ఎన్నికల కోడ్ ఉండటం వల్ల సీఎం హోదా లో ఉన్న రేవంత్ రెడ్డి పట్టు వస్త్రాలు సమర్పించలేకపోతున్నారు. దీంతో ప్రభుత్వ సీఎస్ శాంతి కుమారి రాములవారి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పిస్తున్నారు. ఇక రాముల వారి కళ్యాణం కోసం మిథిలా స్టేడియం ను చక్కగా రెడీ చేశారు. వేసవి తాపం భక్తులకు తాకకుండా ఉండేందుకు ఏసీలు, కూలర్లు, ఫ్యాన్లు అమర్చారు.
0