సింగరేణి సంస్థలో ఇటీవల కొత్తగా ఉద్యోగ నియామకాలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ ఉద్యోగాలకు ఎంపికైన 593 మందికి నియామక పత్రాలను సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదగా అందించనున్నారు. డిసెంబరు 4న పెద్దపల్లిలో నిర్వహించే ప్రజాపాలన విజయోత్సవాల సభలో ఈ మేరకు సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి ఎంపికైన వారికి నియామక పత్రాలు అందజేయనున్నారని సింగరేణి సీఎండీ బలరాం ఓ ప్రకటనలో తెలిపారు. విజయోత్సవాల నిర్వహణపై ఆయన తాజాగా సమీక్ష నిర్వహించారు. విజయోత్సవాల్లో భాగంగా సింగరేణిలో కూడా కార్యక్రమాలు జరగనున్నాయి. దీంతో సింగరేణిలో ఘనంగా నిర్వహించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు.
గత ఏడాది కాలంలో సింగరేణిలో దాదాపు 2,165 మందికి కొత్తగా ఉద్యోగాలు కల్పించామని ఆయన అన్నారు. చరిత్రలో అత్యధికంగా 33 శాతం లాభాల వాటా బోనస్‌ను కార్మికులకు ఈ ఏడాది పంపిణీ చేశామని, దీంతో ఒక్కొక్కరికి రూ.1,90,000 వరకు లాభాల వాటా అందిందని ఆయన పేర్కొన్నారు. తొలిసారి కాంట్రాక్టు కార్మికులకు సైతం రూ.5 వేల వరకు లాభాల వాటా పంపిణీ చేశామని ఆయన ఈ సందర్భంగా వెల్లడించారు. మరో రెండు రోజుల్లో నిర్వహించనున్న సింగరేణి ఉద్యోగ నియామకపత్రాల పంపిణీ కార్యక్రమాన్ని పండగలా నిర్వహించాలని ఆయన అధికారులను అదేశించారు.
‘ఎంపీహెచ్‌ఏల నియామకం చెల్లదు.. ఈ జీవో చట్ట విరుద్దం’.. తెలంగాణ హైకోర్టు
2002లో జారీ చేసిన మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్(ఎంపీహెచ్ఎ) నోటిఫికేషన్ అర్హతల వివాదంపై సుప్రీంకోర్టు, హైకోర్టు తీర్పులు అప్పట్లో పెను ప్రకంపనలు సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే ఈ తీర్పులను కాదని నాటి ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం జీవో ద్వారా నియామకాలు చేపట్టడం చెల్లదని తెలంగాణ హైకోర్టు తీర్పు వెలువరించింది. నాటి కోర్టు ఉత్తర్వులతో తొలగించిన 1200 మందిని కాంట్రాక్ట్ పద్ధతిలో తిరిగి విధుల్లోకి తీసుకుంటూ ప్రభుత్వం జారీ చేసిన జీవో 1207 చట్టవిరుద్ధమని వ్యాఖ్యానించింది. 90 రోజుల్లో అర్హులతో కూడిన జాబితా సిద్ధం చేసి నియామక ప్రక్రియ మళ్లీ చేపట్టాలని హైకోర్టు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేసింది. ఈమేరకు జస్టిస్ సుజయ్‌పాల్, జస్టిస్ నామవరపు రాజేశ్వరరావులతో కూడిన ధర్మాసనం తీర్పు వెలువరించింది.