బ్రేకులు ఫెయిల్ అయి ఆర్టీసీ బస్సు చెట్టును ఢీకొన్న సంఘటన కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం హాజీపూర్ తండా మూలమలుపు వద్ద చోటుచేసుకుంది.ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి.స్థానికులు,ప్యాసింజర్ల కథనం ప్రకారం ఎల్లారెడ్డి నుంచి నిజాంసాగర్ వైపు వెళ్తున్న కామారెడ్డి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఒక్కసారిగా హాజీపూర్ తండా మూలమలుపు వద్ద బస్సు బ్రేకులు ఫెయిల్ అయి చెట్టును ఢీకొంది.దీంతో బస్సులో ప్రయాణిస్తున్న మహిళ కండక్టర్ తో పాటు..సుమారు పదిమందికి గాయాలయ్యాయి.ప్రమాదం సంభవించినప్పుడు బస్సులో సుమారు 40 మంది ప్రయాణికులు ఉన్నట్లుగా స్థానికులు తెలిపారు.గాయపడ్డ వారిని చికిత్స నిమిత్తం ఎల్లారెడ్డి ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించారు.స్థానిక ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు సంఘటన స్థలానికి చేరుకొని బస్సు ప్రమాదంకు గల కారణాలను ఆర్టీసీ అధికారులతో ఫోన్లో మాట్లాడి అడిగి తెలుసుకున్నారు.గాయపడ్డ వారిని అంబులెన్స్ లో ఎమ్మెల్యే ఎల్లారెడ్డి ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించారు.బస్సు ప్రమాదంకు గల కారణాలను ప్యాసింజర్లను, స్థానికులను ఎమ్మెల్యే అడిగి తెలుసుకున్నారు.గాయపడ్డ వారికి మెరుగైన చికిత్స అందించాలని డాక్టర్లకు ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు సూచించారు.
26/08/2024
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్‌పై మంగళవారం సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఢిల్లీ మద్యం కుంభకోణంలో అరెస్టు అయిన కవిత.. ప్రస్తుతం తీహార్ జైల్లో ఉంటున్న సంగతి తెలిసిందే. ఆమె ఇటీవలే తీవ్ర అస్వస్థతకు గురికాగా, ఢిల్లీ ఎయిమ్స్‌కు తరలించి చికిత్స అందించారు. అనంతరం తిరిగి జైలుకు తీసుకొచ్చారు. ఎమ్మెల్సీ కవిత మార్చి 15వ తేదీ నుంచి తీహార్ జైల్లో ఉంటున్నారు. కవిత తరఫున ప్రముఖ న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించనున్నారు. దీంతో ఈసారి కవితకు బెయిల్ తప్పకుండా వస్తుందనే నమ్మకంతో బీఆర్ఎస్ నాయకత్వం ఉంది.
కవిత మార్చిలో జైలుకు వెళ్లగా.. జూలై 16న తొలిసారి అస్వస్థతకు గురయ్యారు. అప్పుడు కవితను ఢిల్లీలోని దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. రెండు రోజుల తర్వాత 18న ఆమెను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టులో హాజరుపరచగా, తనకు ఎదురవుతున్న అనారోగ్య సమస్యలను జడ్జి కావేరి బవేజా దృష్టికి తీసుకెళ్లారు. కవిత విజ్ఞప్తి మేరకు ఢిల్లీ ఎయిమ్స్‌లో వైద్య పరీక్షలకు అనుమతి ఇచ్చారు. అప్పటి నుంచి ఆమె ఆరోగ్య పరిస్థితి పూర్తిగా మెరుగుపడలేదు. జైలు వైద్యులే ఆమెకు వైద్యం అందిస్తున్నారు.
మళ్లీ ఆగస్టు 22న కవిత అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఢిల్లీ ఎయిమ్స్‌కు కవితను తరలించి.. ఆమె భర్త అనిల్ సమక్షంలో వైద్య పరీక్షలు చేశారు. అదే రోజు మధ్యాహ్నం 2 గంటల సమయంలో తిరిగి జైలుకు తరలించారు. ఆమె సుమారు ఐదున్నర నెలల నుంచి జైలులోనే ఉన్నారు. జైలుకు వెళ్లిన తర్వాత ఆమె సుమారు 11 కేజీల బరువు తగ్గారు.
ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా పనిచేసిన మాజీ నటుడు బాబుమోహన్ తిరిగి సొంత గూటికి చేరే ప్రయత్నం చేస్తున్నారు. రాజకీయ అరంగేట్రం చేసిన తెలుగుదేశం పార్టీలోకి తిరిగి చేరనున్నట్లు సమాచారం. తాజాగా హైదరాబాద్ లో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో బాబుమోహన్ భేటీ అయ్యారు. రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయాలపై ఇరువురు నేతలు చర్చించుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే టీడీపీలో చేరిక విషయం ప్రస్తావనకు వచ్చిందని, బాబుమోహన్ చేరిక పట్ల చంద్రబాబు సానుకూలంగా స్పందించారని పార్టీ వర్గాలు తెలిపాయి. బాబుమోహన్ త్వరలోనే పసుపు జెండా కప్పుకోనున్నారని వెల్లడించాయి.
తెలంగాణలో మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. సీఎంఆర్ఎఫ్ నిధుల కోసం నకిలీ బిల్లులు సృష్టించి సర్కారుకు టోపీ పెట్టారు. ఈ వ్యవహారంపై సీరియస్ అయిన ప్రభుత్వం సీఐడీ విచారణకు ఆదేశించింది. తాజాగా సీఐడీ 28 ఆస్పత్రులపై కేసు నమోదు చేసింది.ఫేక్ బిల్లులు పెట్టి సీఎంఆర్ఎఫ్ నిధులను మింగేయాలనుకున్న వారికి తెలంగాణ సీఐడీ షాక్ ఇచ్చింది. హైదరాబాద్, ఖమ్మం, నల్గొండ, కరీంనగర్, వరంగల్, మహబూబాబాద్ జిల్లాల్లోని పలు ఆసుపత్రులపై సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఈ స్కామ్‌లో ఆసుపత్రుల సిబ్బంది, లోకల్ లీడర్లు, అధికారులు ఉన్నట్టు తెలుస్తోంది. గత ప్రభుత్వం హయాంలో జరిగిన కుంభకోణం వెలుగులోకి రావడంతో.. సీఎం రేవంత్ రెడ్డి సీఐడీ విచారణకు ఆదేశించారు.
తెలంగాణ సచివాలయంలోని రెవెన్యూ శాఖలో పనిచేసే సెక్షన్ ఆఫీసర్ డీఎస్ఎన్ మూర్తి ఫిర్యాదుతో.. దర్యాప్తు ప్రారంభించారు. చాలా మంది ఆస్పత్రుల్లో చికిత్స చేయించుకోకున్నా.. చేయించుకున్నట్టు బిల్లులు సృష్టించారు. ఆ నకిలీ బిల్లులుతో సీఎంఆర్ఎఫ్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. దీనికి ఆయా ఆస్పత్రుల్లో పనిచేసే సిబ్బంది, లోకల్ ప్రజా ప్రతినిధులు సహకరించారు. ఈ వ్యవహారంతో.. రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థికంగా నష్టం కలిగిందని అధికారులు చెబుతున్నారు.
హైదరాబాద్‌లోని ఈ హాస్పిటళ్లపై ఎఫ్ఐఆర్..
అరుణ శ్రీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, ఐఎస్ సదన్ ఎక్స్ రోడ్
శ్రీ కృష్ణ హాస్పిటల్, సైదాబాద్
జననీ హాస్పిటల్, సైదాబాద్
హిరణ్య హాస్పిటల్, మీర్పేట్
డెల్టా హాస్పిటల్, హస్తినాపురం
శ్రీ రక్ష హాస్పిటల్, బీఎన్ రెడ్డి నగర్
ఎంఎంఎస్ హాస్పిటల్, సాగర్ రింగ్ రోడ్
ఏడీఆర్ఎం మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, శారదానగర్
ఎంఎంవీ ఇందిరా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, కొత్తపేట
శ్రీ సాయి తిరుమల హాస్పిటల్, బైరామల్‌గూడ
ఖమ్మం:
శ్రీ శ్రీకరా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్
గ్లోబల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్
డా. జే.ఆర్. ప్రసాద్ హాస్పిటల్
శ్రీ వినాయక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్
శ్రీ సాయి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్
వైష్ణవి హాస్పిటల్
సుజాత హాస్పిటల్
కొత్త అమృత హాస్పిటల్
ఆరెంజ్ హాస్పిటల్
మెగశ్రీ హాస్పిటల్, బోనకల్
నల్గొండ:
నవీనా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, మిర్యాలగూడ
మహేష్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, మిర్యాలగూడ
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ రాష్ట్రంలో పెరుగుతున్న డెంగీ మరణాలపై ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఆవేదన వ్యక్తం చేశారు. ‘తెలంగాణలో డెంగీ మరణాలు లేవని ప్రభుత్వం చెబుతోంది. కానీ, వార్తా పత్రికల్లో మాత్రం ఒక్కరోజులో ఐదు మంది డెంగీతో చనిపోయినట్లు కథనాలు వచ్చాయి. డెంగీతో మరో ముగ్గురు చనిపోయినట్లు ఇవాళ కూడా వార్తా పత్రికల్లో వార్తలు ఉన్నాయి.
ఈ డేటాను ఎవరు దాచిపెడుతున్నారు..? ఎందుకు దాచిపెడుతున్నారు..? అని కేటీఆర్ మండిపడ్డారు. ప్రస్తుతం ప్రభుత్వ ఆసుపత్రుల్లో సరిపడా మందులు, బెడ్స్ లేవు. చాలా ఆసుపత్రుల్లో ఒక్కో బెడ్‌పై ముగ్గురు, నలుగురు రోగులు ఉండి చికిత్స పొందుతున్న దారుణపరిస్థితి’ అని పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో ఈ పరిస్థితిని సీరియస్‌గా పరిగణించి, రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలని రాష్ట్ర ప్రధానకార్యదర్శి శాంతికుమారిని కేటీఆర్ కోరారు. అలాగే వివిధ వార్తా పత్రికల్లో డెంగీ మరణాలపై ప్రచురితమైన కథనాల తాలూకు క్లింపింగ్స్‌ను ఈ ట్వీట్‌కు కేటీఆర్ జత చేశారు.
మధ్య ప్రాచ్యంలో పరిస్థితులను గమనిస్తూ మూడో ప్రపంచ యుద్ధం మరెంతో దూరంలో లేదనిపిస్తోందని అమెరికా మాజీ అధ్యక్షుడు, ప్రస్తుత అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. అమెరికాను ప్రపంచ సంక్షోభంవైపు నడిపిస్తున్నారంటూ ప్రెసిడెంట్ జో బైడెన్, వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ పై మండిపడ్డారు. మధ్య ప్రాచ్యంలో బాంబుల వర్షం కురుస్తుంటే నిద్రముఖం బైడెన్ కాలిఫోర్నియా బీచ్ లో నిద్రపోతున్నాడంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పరస్పరం దాడులు చేసుకుంటున్న దేశాలతో చర్చలు జరిపే ప్రయత్నం చేయకుండా కమలా హారిస్ తీరిగ్గా బస్సులో తిరుగుతూ ఎన్నికల ప్రచారం చేసుకుంటోందని విమర్శించారు.
కాగా, మూడో ప్రపంచ యుద్ధం తప్పదంటూ ట్రంప్ హెచ్చరించడం ఇది 32 వ సారి. 2013 నుంచి పలు సందర్భాలలో దీనిపై సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ వస్తున్నారు. అయితే, తాజాగా డెమోక్రాట్ల తరఫున కమలా హారిస్ ప్రెసిడెన్షియల్ ఎన్నికల్లో పోటీపడుతుండడంతో ఆమెపై విమర్శల జోరు పెంచారు. కమల నాయకత్వంలో అమెరికాకు భవిష్యత్తు అనేదే ఉండదని తాజాగా ఆరోపించారు. తామందరినీ ఆమె అణుయుద్దం వైపు తీసుకెళుతుందని హెచ్చరించారు.
మోసాలకు అలవాటైన కేటుగాళ్లు కొత్తకొత్త మార్గాలను అన్వేషిస్తుంటారు. టెక్నాలజీ పెరిగిపోయిన ఈ రోజుల్లో వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించి బ్యాంకు ఖాతాల్లోని సొమ్మును కాజేసేందుకు మోసగాళ్లు జిత్తులమారి మార్గాలను వెతుకుతున్నారు. టెలికం దిగ్గజం రిలయన్స్ జియో ప్రతినిధులమంటూ వ్యక్తిగత సమాచారాన్ని కోరుతున్న కొందరు కేటుగాళ్ల వ్యవహారం తాజాగా బయటపడింది. ఈ విషయాన్ని గుర్తించిన రిలయన్స్ జియో స్వయంగా కస్టమర్లను అప్రమత్తం చేసింది. జియో పేరిట జనాలను మోసగిస్తున్నారని, మోసగాళ్లు జియో ప్రతినిధులుగా నటిస్తూ సున్నిత సమాచారం పొందేందుకు ప్రయత్నిస్తున్నారని, ఈ తరహా సైబర్ మోసాలకు సంబంధించి నమోదైన కేసులు తమ దృష్టికి వచ్చాయంటూ కస్టమర్లను జియో అప్రమత్తం చేసింది.
ఇలా నమ్మిస్తున్నారు..
కేటుగాళ్లు పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, బ్యాంక్ ఖాతా, క్రెడిట్ కార్డ్, ఓటీపీ, సిమ్ వంటి వివరాలు తెలుసుకునేందుకు వాట్సాప్ చాట్, ఫోన్ కాల్లు, మెసేజులు, ఈ-మెయిల్స్‌తో పాటు ఇతర మార్గాల్లో కస్టమర్లను సంప్రదిస్తున్నారు. జియో ప్రతినిధులుగా నమ్మించి వివరాలు అడుగుతున్నారని జియో పేర్కొంది. కోరిన వివరాలు అందించకపోతే సిమ్ కార్డ్ బ్లాక్ చేస్తామని హెచ్చరిస్తున్నారు. ఇక థర్డ్-పార్టీ యాప్‌లను ఇన్స్టాల్ చేసుకోవాలంటూ సూచిస్తున్నారని, తద్వారా మొబైల్, కంప్యూటర్లోని వ్యక్తిగత సమాచారాన్ని పొందుతున్నారని జియో అలర్ట్ చేసింది.
థర్డ్-పార్టీ యాప్‌లను డౌన్లోడ్ చేసుకోవాలని, ఈ-మెయిల్ ద్వారా వచ్చిన లింక్‌లపై క్లిక్ చేయమని కస్టమర్లను కోరబోమని జియో పేర్కొంది. కాగా సిమ్‌పై ఉంటే 20 అంకెల సిమ్ నంబర్‌ను ఎవరితోనూ పంచుకోవద్దని జియో సూచించింది. యాప్‌లు, ఆన్లైన్ ఖాతాల పాస్వర్డ్లు, పిన్ నంబర్లను మార్చుతూ ఉండడం మంచిదని సూచించింది.x
కారు డ్రైవర్ హెల్మెట్ పెట్టుకోలేదని జరిమానా విధించిన ట్రాఫిక్ పోలీసులు
కాస్త ఆశ్చర్యం కలిగిస్తున్నప్పటికీ.. హెల్మెట్ ధరించలేదంటూ ఓ కారు యజమానికి జరిమానా విధించిన ఘటన ఒకటి ఉత్తరప్రదేశ్‌లో వెలుగులోకి వచ్చింది. తుషార్ సక్సేనా అనే వ్యక్తికి ఈ పరిస్థితి ఎదురైంది. తాను ఎప్పుడూ కారులో నోయిడాకు వెళ్లలేదని, కానీ అక్కడి ట్రాఫిక్ పోలీసులు మాత్రం హెల్మెట్ లేదనే కారణంతో తనకు రూ.1000 జరిమానా విధించారని తుషార్ సక్సేనా వాపోయాడు.
జరిమానాకు సంబంధించి మొదట ఒక మెసేజ్ రాగా దానిని తాను పట్టించుకోలేదని, ఏదో పొరపాటున వచ్చి ఉంటుందిలే అని భావించానని చెప్పాడు. అయితే ఆ తర్వాత ఒక ఈ-మెయిల్, మరొక మెసేజ్ కూడా రావడంతో విషయం అర్థమైందని, నోయిడాకు 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న రాంపూర్ జిల్లాలో తాను నివసిస్తున్నానని అతడు వివరించాడుు. జరిమానా విషయమై ట్రాఫిక్ పోలీసులను సంప్రదించానని, హెల్మెట్ లేకుండా ఫోర్-వీలర్ వాహనాన్ని నడిపినందుకు ఫైన్ విధించామంటూ సమాధానం ఇచ్చారని తుషాక్ సక్సేనా వివరించాడు. జరిమానా చెల్లించకపోతే కోర్టులో హాజరుపరచాల్సి ఉంటుందని కూడా హెచ్చరించారని పేర్కొన్నాడు.
కారులో హెల్మెట్ ధరించాలనే రూల్ ఉందా?
నవంబర్ 9, 2023న చలాన్ వచ్చిందని తుషార్ సక్సేనా వెల్లడించారు. ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘిస్తే జరిమానా విధించడం సాధారణమే, కానీ తన విషయంలో మాత్రం ఈ జరిమానా సరికాదని ఆవేదన వ్యక్తం చేశాడు. తాను ఎప్పుడూ కారును ఢిల్లీ (ఎన్సీఆర్) ప్రాంతానికి తీసుకెళ్లలేదని, హెల్మెట్ ధరించి కారు నడపాలనే నిబంధన ఏదైనా ఉంటే అధికారులు తనకు లిఖితపూర్వకంగా ఇవ్వాలని అతడు డిమాండ్ చేశాడు. కాగా గతేడాది మార్చిలో తాను కారును కొనుగోలు చేశానని, వాహనం రిజిస్ట్రేషన్‌ను ఘజియాబాద్ నుంచి రాంపూర్‌కు మార్చుకున్నానని వివరించాడు. విచారణ జరిపి తన జరిమానాను రద్దు చేయాలంటూ నోయిడా ట్రాఫిక్ పోలీసులకు తుషార్ సక్సేనా విజ్ఞప్తి చేశాడు.