జిన్నారం మండలం కిష్టయ్య పల్లి గ్రామంలో గత మూడు రోజుల క్రితం కాలుష్య జలాలు తాగి గేదెల మృతి కారణమైన పరిశ్రమలపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు నష్టపోయిన రైతు కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవాలని రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి మెంబర్ సెక్రటరీ రవి గుగులోతును పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కోరారు. శనివారం పిసిబి మెంబర్ సెక్రెటరీ రవితో ఫోన్లో మాట్లాడి ఘటన వివరాలు తెలిపారు. గత పది సంవత్సరాలుగా పటాన్చెరు నియోజకవర్గంలో కాలుష్యం తగ్గుతుందనుకుంటున్న తరుణంలో.. కొన్ని పరిశ్రమలు హానికారక రసాయన జలాలను చెరువులు, కుంటల్లోకి విడుదల చేయడం మూలంగా మూగజీవాల మృతి చెందుతున్నాయని తెలిపారు. ఈ నేపథ్యంలోనే కిష్టయ్య పల్లి గ్రామానికి చెందిన యువ రైతు బాశెట్టి సాయికుమార్ కి చెందిన 12 గేదెలు రసాయన జరాలు తాగి మృతి చెందాయని తెలిపారు. ఉన్నత విద్యావంతుడైన సాయికుమార్ పాడి పరిశ్రమపై మక్కువతో డైరీ ఫార్మ్ ఏర్పాటు చేస్తే.. ఫార్మా పరిశ్రమల నిర్లక్ష్యం మూలంగా కోలుకోలేని ఆర్థిక నష్టం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అంశంపై పూర్తిస్థాయిలో విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఇందుకు స్పందించిన కాలుష్య నియంత్రణ మండలి మెంబర్ సెక్రటరీ రవి గుగులోతు.. వచ్చే వారంలో క్షేత్రస్థాయి పర్యటన చేద్దామని ఎమ్మెల్యే జిఎంఆర్ కు తెలిపారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ.. నష్టపోయిన రైతు సాయికుమార్ కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవడంతోపాటు భవిష్యత్తులో సంఘటనలు పునరావృత్తం కాకుండా కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.