ప్రైవేట్ హాస్టళ్లలో భద్రత కరువవుతున్నది. అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారుతున్నది. పంజాగుట్ట పోలీసుస్టేషన్ పరిధిలో పలు హాస్టళ్లను పోలీసులు తనిఖీలు చేపట్టగా, డొల్లతనం బయటపడింది. అనేక హాస్టళ్లలో పని చేయని సీసీ కెమెరాలు, సెక్యూరిటీ గార్డు వ్యవస్థ, హాస్టళ్లలో చేరే వారి పేర్లు సరిగా లేకపోవడం, దానికి సంబంధించిన రిజిస్టర్లను నిర్వహించకపోవడాన్ని పోలీసులు గుర్తించారు.
పంజాగుట్ట ఏసీపీ మోహన్ కుమార్, సీఐ శోభన్ నేతృత్వంలో 25 మంది సిబ్బంది ఈ తనిఖీలు చేపట్టారు. ఇప్పటికే వివిధ హాస్టళ్లు నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తుండడంతో పాటు మరికొన్నింటిలో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయన్న ఆరోపణలు వచ్చాయి. అలాగే పలు డ్రగ్స్ విక్రయ ముఠాలకు అడ్డాగా మారిందన్న ఆరోపణలు సైతం వినిపించాయి. దీంతో పోలీసులు ప్రైవేట్ హాస్టళ్లపై ప్రత్యేక దృష్టి పెట్టారు.
పని చేయని సీసీ కెమెరాలు
పంజాగుట్ట పోలీసు స్టేషన్ పరిధిలో గతంలో అనేక చోరీ ఘటనలు చోటు చేసుకున్నాయి. తాజాగా ఓ సెల్‌ఫోన్ సైతం అపహరణకు గురికాగా, సీసీ కెమెరాలు పనిచేయకపోవడంతో దొంగలను పట్టుకునేందుకు నానా తంటాలు పడ్డారు. నెల రోజుల కిందట పోలీస్ అధికారులు..సుమారు 250 మంది హాస్టళ్ల యాజమాన్యాలను పిలిపించి.. నిబంధనలను పాటించాలంటూ.. స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అయినా..ఏ ఒక్క హాస్టల్ యజమాని కూడా నిబంధనలను పాటించడం లేదన్న విషయం తాజా తనిఖీల్లో వెలుగు చూశాయి. సోమవారం అమీర్‌పేటలోని హ్యాపీ హోమ్స్, కావూరి మెన్స్ హాస్టళ్లలో తనిఖీలు నిర్వహించగా, సీసీ కెమెరాల వ్యవస్థ లేదు. ఉన్న కెమెరాలు పనిచేయకపోవడంతో పాటు దానిని భద్రపరిచే డీవీఆర్ పనిచేయడం లేదు.
పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో సుమారు 250కి పైగా ప్రైవేట్ హాస్టళ్లు ఉన్నాయి. గతంలోనే ఆయా హాస్టళ్లను పరిశీలించిన పోలీసులు వారికి నోటీసులు సైతం జారీ చేశారు. అయినా యాజమాన్యాలు పట్టించుకోలేదు. తాజాగా జరిగిన తనిఖీల్లో సెక్యూరిటీ గార్డులే కనిపించలేదు. ఒక్క హాస్టల్లో కూడా సరైన సెక్యూరిటీ వ్యవస్థ లేదు. రాత్రి వేళల్లో హాస్టళ్ల వద్ద లైట్లు సైతం వెలుగడం లేదు. దీంతో తరచూ దొంగతనాలు జరుగుతున్నట్లు పోలీసులకు ఫిర్యాదులు అందుతున్నాయి. హాస్టళ్లలో చేరే వారి సమాచారం కూడా యాజమాన్యాల వద్ద లేకపోవడాన్ని గుర్తించారు. కొందరి ఆధార్ కార్డులు సైతం అస్పష్టంగా ఉన్నాయి.