టీమ్ ఇండియాకు ఆడే ఆటగాళ్లు మూడు ఫార్మాట్లలో కచ్చితంగా ఆడాల్సిందేనని కొత్త హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ స్పష్టం చేశాడు. గాయపడటం ఆటలో భాగమేనని… గాయపడిన వారు విశ్రాంతి తీసుకుని మళ్లీ జట్టులోకి వస్తారని… అప్పుడు మూడు ఫార్మాట్లలో ఆడాల్సిందేనని చెప్పారు. మీరు దేశం కోసం ఆడాలనుకుంటే… వీలైనంత ఎక్కువ క్రికెట్ ఆడేందుకు ప్రయత్నించాలని సూచించారు. మంచి ఫామ్ లో ఉన్న ఆటగాళ్లు ఒక అడుగు ముందుకేసి అన్ని ఫార్మాట్లలో ఆడాలని చెప్పారు. కేవలం మీ గురించి మాత్రమే ఆలోచించుకోవడానికి ఇది ఒకరు ఆడే ఆట కాదని అన్నారు. అంతిమంగా జట్టు ప్రయోజనాలే ముఖ్యమనే విషయాన్ని గుర్తుంచుకోవాలని చెప్పారు. ప్రొఫెషనల్ క్రికెటర్లను చూసి నేర్చుకోవాలని సూచించారు.
12/07/2024
గ్రూప్-1 ఉద్యోగాలు తక్కువ ఉన్నాయని గతంలో చెప్పిన కాంగ్రెస్… అధికారంలోకి వచ్చాక కేవలం 60 పోస్టులనే పెంచిందని మెదక్ ఎంపీ, బీజేపీ నేత రఘునందన్ రావు విమర్శించారు. చదువుకున్న వారికే పోటీ పరీక్షల విలువ తెలుస్తుందన్నారు. ఒక పరీక్షకు మరో పరీక్షకు మధ్య నెల రోజుల వ్యవధి ఉండాలన్నారు.
ఆయన హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ… లక్షల రూపాయల జీతం తీసుకునే సీఎం రేవంత్ రెడ్డి వద్ద నిరుద్యోగ భృతి ఇవ్వడానికి డబ్బులు లేవని ఎద్దేవా చేశారు.
కుల, జన గణన ఏమైందని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆయన ప్రశ్నించారు. కేసీఆర్ చేయించిన సమగ్ర కుటుంబ సర్వే వివరాలు బయటకు తీస్తే 24 గంటల్లో సమస్యకు పరిష్కారం లభిస్తుందని సూచించారు. పంచాయతీ, ఎంపీటీసీ పదవీ కాలం ముగిసి మూడు నెలలు గడుస్తున్నప్పటికీ స్థానిక సంస్థల ఎన్నికల గురించి ప్రభుత్వం ఎందుకు ఆలోచించడం లేదో చెప్పాలన్నారు. నెల రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలని డిమాండ్ చేశారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు శుక్రవారం బహిరంగ లేఖ రాశారు. పేద బ్రాహ్మణులకు సంక్షేమ కార్యక్రమాలను కొనసాగించాలని కోరారు. బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ అగమ్యగోచరంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. విద్య, ఉపాధి వంటి పథకాలు ఆగిపోవడం విచారకరమన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం బ్రాహ్మణ సంక్షేమాన్ని విస్మరించిందని మండిపడ్డారు. సంక్షేమ పరిషత్ ద్వారా అమలుచేసే పథకాలు నిలిచిపోయయన్నారు.
బ్రాహ్మణుల గౌరవాన్ని మరింత పెంచేలా దేశంలోనే తొలిసారిగా, రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం గోపనపల్లిలో రూ.12 కోట్లతో 10 ఎకరాల విస్తీర్ణంలో విప్రహిత బ్రాహ్మణ సదన్ నిర్మించి, బ్రాహ్మణ సంక్షేమం విషయంలో తెలంగాణను దేశానికే ఆదర్శంగా నిలిపామన్నారు. కానీ ఇప్పుడు, విద్య, స్వయం ఉపాధి, వేద విద్యకు ప్రోత్సాహం కోసం అమలు చేసిన పథకాలు ఆగిపోవడం విచారకరమన్నారు. రాష్ట్రంలో అసలు బ్రాహ్మణ పరిషత్ ఉన్నట్టా? లేనట్టా? అనే ఆందోళన బ్రాహ్మణ సామాజికవర్గంలో నెలకొన్నదన్నారు.
బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ కోసం కేసీఆర్ ఏటా రూ.100 కోట్లు కేటాయించారని, ‘వివేకానంద’ పేరుతో విదేశీ విద్యా పథకం, ‘శ్రీ రామానుజ’ పేరుతో ఫీజు రీయంబర్స్మెంట్ పథకం, ‘వేదహిత’ పేరుతో వేద పాఠశాలలకు, వేద విద్యార్థులకు ఆర్థిక సహాయం, ప్రతి నెల వేద శాస్త్ర పండితులకు గౌరవ వేతనం, ఔత్సాహిక పారిశ్రామిక, వ్యాపారవేత్తలకు ఆర్థిక ప్రోత్సాహం, బ్రాహ్మణ యువతకు పోటీ పరీక్షల శిక్షణ వంటి పథకాలను అమలు చేసి ఎంతోమంది పేద బ్రాహ్మణ కుటుంబాల్లో వెలుగులు నింపారన్నారు.
హీరో రాజ్ తరుణ్, లావణ్య ప్రేమాయణంపై ప్రముఖ నటి కరాటే కల్యాణి తాజాగా స్పందించారు. పోలీసుల దాకా వెళ్లిన ఈ వ్యవహారం పూర్తిగా వారిద్దరి వ్యక్తిగతమని చెప్పారు. ఇండస్ట్రీకి దీంతో సంబంధం లేదంటూనే లావణ్యకు మద్దతుగా ఆమె వ్యాఖ్యలు చేశారు. ఈ కేసులో చోటుచేసుకున్న పరిణామాలు చూస్తుంటే లావణ్య ఇప్పటికీ రాజ్ తరుణ్‌ని కోరుకుంటున్నట్లు తెలుస్తోందన్నారు. కానీ రాజ్ తరుణ్ అందుకు అంగీకరించడం లేదని అనిపిస్తుందని వివరించారు. పోలీస్ కంప్లైంట్ వాపస్ తీసుకోవడానికి లావణ్య డబ్బులు తీసుకుందనే ఆరోపణలు నిజం కాకపోవచ్చని, అదే నిజమైతే ఆధారాలు బయటపెట్టేవారని తెలిపారు. తినడానికి ఇరవై వేలు ఇవ్వాలని అడుగుతుందంటే లావణ్య ఏ పరిస్థితుల్లో ఉందనేది అర్థం చేసుకోవచ్చని కరాటే కల్యాణి అన్నారు.
లావణ్య, రాజ్ తరుణ్ ప్రేమ వ్యవహారం పోలీసుల దాకా చేరినప్పటికీ రాజ్ తరుణ్ తల్లిదండ్రులు స్పందించకపోవడంపై కరాటే కల్యాణి తప్పుబట్టారు. పదేళ్లుగా కలిసి ఉంటున్న వీరిద్దరి ప్రేమ వ్యవహారం అందరికీ తెలుసని, సోషల్ మీడియాలో కూడా ఫొటోలు ఉన్నాయని గుర్తుచేశారు. అయినా కూడా రాజ్ తరుణ్ పేరెంట్స్ స్పందించడంలేదంటే లావణ్య చెప్పినవన్నీ నిజాలేనని భావించాల్సి ఉంటుందన్నారు.
అమ్మాయి అయినా, అబ్బాయి అయినా.. నేరానికి పాల్పడ్డాక కచ్చితంగా శిక్ష అనుభవించాల్సిందేనని కరాటే కల్యాణి స్పష్టం చేశారు. అయితే, చట్టాల్లోని లొసుగులను అడ్డంపెట్టుకుని కొంతమంది తప్పించుకుంటున్నారని ఆరోపించారు. నేరం చేసినా సరే తప్పించుకోవచ్చని భావించే వారికి భయం కలిగేలా చట్టాలలో మార్పు చేయాల్సిన అవసరం ఉందని, కఠిన శిక్ష తప్పదనే హెచ్చరిక జనంలోకి వెళ్లాలని కల్యాణి చెప్పుకొచ్చారు.
ఏపీ ప్రజలకు షాక్..”అమ్మకు వందనం” పథకంలో మెలిక పెట్టారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు. అమ్మకు వందనం పథకంలో పెట్టిన చిన్న మెలిక ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. ఎన్నికలకు ముందు ఇంట్లో ఎంత మంది పిల్లలుంటే అంతమందికీ ‘అమ్మకు వందనం’ పథకం అమలు చేస్తానని హామీ ఇచ్చిన చంద్రబాబు తాజాగా కేవలం ఇంట్లో ఒక్కరికే ఈ పథకం వర్తిస్తుందని స్పస్టం చేసింది ఏపీ సర్కార్.
విద్యార్థికి 75శాతం హాజరుశాతం తప్పకుండా ఉండాలని పేర్కొన్నారు. దీంతో సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో వైసీపీ నేతలు ప్రభుత్వ తీరుపై మండిపడుతున్నారు. ఇక అటు అమ్మకు వందనం, స్టూడెంట్ కిట్ పథకాలకు ఆధార్ తప్పనిసరని లేని పక్షంలో ఆధార్ కోసం నమోదు చేసుకొని ఉండాలని విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఆధార్ వచ్చేవరకు పాన్ కార్డు, పాస్ పోర్ట్, రేషన్ కార్డు, ఓటర్ ఐడీ, డ్రైవింగ్ లైసెన్స్ వంటి 10 ఐడీ కార్డుల్లో ఏదో ఒకటి సమర్పించాలంది. అమ్మకు వందనం కింద విద్యార్థుల సంరక్షకులకు రూ. 15 వేలు, స్టూడెంట్ కిట్ లో బ్యాగ్, దుస్తులు తదితరాలు అందిస్తోంది.
తెలంగాణలో ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి నిర్వహించే డీఎస్సీ పరీక్షల హాల్ టిక్కెట్లు విడుదలయ్యాయి. డీఎస్సీ పరీక్షలు ఈ నెల 18 నుంచి ఆగస్ట్ 5వ తేదీ వరకు జరగనున్నాయి.
ఆన్ లైన్ విధానంలో ఈ పరీక్షలు ఉండనున్నాయి. డీఎస్సీ పరీక్షల కోసం రాష్ట్రవ్యాప్తంగా 2.7 లక్షల మందికి పైగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. మొత్తం 11,062 టీచర్ పోస్టుల భర్తీకి జూన్ 20 వరకు దరఖాస్తులు స్వీకరించారు.
అభ్యర్థులు తమ పేమెంట్ రిఫరెన్స్ ఐడీ లేదా ఆధార్ నెంబర్, పోస్ట్ కేటగిరి, మాధ్యమం, పుట్టిన తేదీ తదితర వివరాలను ఎంటర్ చేసి హాల్ టిక్కెట్లను పొందవచ్చు.