జిన్నారం మండలం రాళ్లకత్వ గ్రామ పరిధిలోని సర్వే నెంబర్ 286 ప్రభుత్వ భూమిలో ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా క్రషర్ ఏర్పాటుకు పనులు నిర్వహిస్తున్నారని రాళ్లకత్వ గ్రామ ప్రజలు ఆరోపించారు. ఈ నేపథ్యంలో శనివారం మండల తాసిల్దార్ కార్యాలయంలో అధికారులకు వినతి పత్రాన్ని అందజేశారు. అక్రమ క్రషర్ ఏర్పాటను అధికారులు తక్షణమే అడ్డుకొని నిలిపివేయాలని కోరారు. అలాగే ఈ అక్రమ క్రషర్కు పంచాయతీ కార్యదర్శి గ్రామ ప్రజలకు వ్యతిరేకంగా సహకరిస్తున్నారని ఆరోపించారు.. వారిపై చర్యలు తీసుకోవాలని ఎంపీడీఓ ఫిర్యాదును చేశారు. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాళ్లకత్వ గ్రామ యువకులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
06/07/2024
సంగారెడ్డి జిల్లా జిన్నారం మండల కేంద్రంలో మంజూరైన జ్యుడీషియల్ మెజిస్టిక్ ఫస్ట్ క్లాస్ కోర్టును పరిశీలించిన జిల్లా జడ్జ్ భవాని చంద్ర . కోర్టు కోసం కేటాయించిన భవనాన్ని పరిశీలించిన జడ్జి అన్ని విధాల అనుకూలంగా ఉందని సానుకూలంగా స్పందించారు తొందరలో కోర్టును ప్రారంభిస్తామని న్యాయవాదులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు నర్సాపూర్ బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ దాసరి శ్రీధర్ రెడ్డి జిన్నారం తహసీల్దార్ బిక్షపతి, డిప్యూటీ తహసీల్దార్ మల్లికార్జున స్వామి, ఆర్ ఐ జయప్రకాశ్, సీఐ సుధీర్, ఎస్సై విజయ్ రావు యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు నరేందర్ నాయకులు పాల్గొన్నారు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య విభజన సమస్యలను పరిష్కరించేందుకు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు హైదరాబాద్‌లోని ప్రజా భవన్లో భేటీ అయ్యారు. ప్రజాభవన్‌కు చేరుకున్న చంద్రబాబుకు ఘన స్వాగతం పలికారు తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు. బాబుకు పుష్పగుచ్ఛం అందజేసి సాదర స్వాగతం పలికారు. అనంతరం భేటీ అయి.. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్న రాష్ట్ర విభజన అంశాలపై ప్రధానంగా చర్చిస్తున్నారు.
తెలుగు రాష్ట్రాలు కలిసి ముందుకు సాగేందుకు, ఉమ్మడిగా అభివృద్ధి సాధించేందుకు ఈ ఇద్దరు ముఖ్యమంత్రులు సమావేశం అయ్యారు. ఏపీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తెలంగాణతో ఉన్న సమస్యల పరిష్కారానికి చొరవ చూపారు చంద్రబాబు నాయుడు. ఈ మేరకు పరిష్కారం దిశగా ముందుగా తెలంగాణ సీఎంకు లేఖ రాశారు చంద్రబాబు. ఇందుకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించారు. దీంతో వెను వెంటనే హైదరాబాద్ వేదికగా సమావేశం అయ్యారు ముఖ్యనేతలు.
ఈ సమావేశంలో రెండు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు నీరబ్‌కుమార్ ప్రసాద్, శాంతికుమారి, తెలంగాణ నుంచి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ తదితరులు చర్చల్లో పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్, రహదారులు భవనాలశాఖ మంత్రి బి.సి.జనార్దన్‌రెడ్డి, పర్యాటకశాఖ మంత్రి కందుల దుర్గేష్ పాల్గొన్నారు. ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి పీయూష్ కుమార్‌తో పాటు ఇతర శాఖల అధికారులు హాజరయ్యారు.
తెలంగాణ మంత్రి, రంగారెడ్డి జిల్లా ఇంఛార్జ్ మంత్రి శ్రీధర్ బాబును శనివారం సాయంత్రం ఆరుగురు ఎమ్మెల్యేలు కలిశారు. మంత్రిని కలిసిన వారిలో ఎమ్మెల్యేలు సుధీర్ రెడ్డి, వివేకానంద గౌడ్, అరికెపూడి గాంధీ, మాధవరం కృష్ణారావు, లక్ష్మారెడ్డి, రాజశేఖర్ రెడ్డిలు ఉన్నారు.
తమ తమ నియోజకవర్గాలలో అభివృద్ధి పనులకు సహకరించాలని మంత్రిని ఎమ్మెల్యేలు కోరారు. అభివృద్ధి పనుల ప్రతిపాదనలను మంత్రికి అందించారు. అలాగే, జీహెచ్ఎంసీకి నిధులు విడుదల చేయాలని వారు శ్రీధర్ బాబును కోరారు. కొత్త ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి జీహెచ్ఎంసీకి నిధులు విడుదల చేయలేదని వారు మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు.
విభజన సమస్యల పరిష్కారంపై చర్చించేందుకు ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇవాళ హైదరాబాద్‌లో సమావేశం కానున్నారు. ఈరోజు సాయంత్రం 6 గంటలకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భేటీ కానున్నారు. ఇందుకు సంబంధించి ప్రజాభవన్‌లో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. విభజనపై ఏపీ, తెలంగాణ మంత్రుల భేటీకి ఎజెండా కూడా ఖరారైంది. ఏపీ, తెలంగాణ నేతలు పది అంశాల ఎజెండాతో చర్చకు రానున్నారు.
విభజన చట్టంలోని 9, 10 షెడ్యూల్స్ పరిధిలోకి వచ్చే కంపెనీల ఆస్తులపై చర్చించారు. షీలా బీడ్ కమిటీ సిఫార్సులను ఇద్దరు ప్రధానులు పర్యవేక్షిస్తారు. విద్యుత్ ఛార్జీలు, ఏపీఎఫ్సీపై కూడా చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. రెండు రాష్ట్రాల మధ్య 15 ఈఏపీ ప్రాజెక్టులకు రుణ చెల్లింపులను చెక్ చేసుకునే అవకాశం ఉంది.
పరస్పరం ఉద్యోగుల నియామకం, కార్మికుల బదిలీలు, జాయింట్ వెంచర్ల నుంచి ఖర్చుల అంచనాపై చర్చించారు. హైదరాబాద్‌లో ఏపీకి మూడు భవనాల కేటాయింపుపై చర్చలు జరుగుతున్నట్లు సమాచారం.
కాగా, విభజన చట్టంలోని సెక్షన్ 9, 10 పరిధిలోని కంపెనీల బ్యాంకు ఖాతాల్లో భారీ మొత్తంలో నగదు ఉన్నట్లు గుర్తించారు. ఈ కంపెనీల బ్యాంకు ఖాతాల్లో రూ.8,000 కోట్ల విలువైన నగదు ఉందని, వాటిని డీమెర్జ్ చేయలేదు. సంస్థలను వేరు చేయనందున ఈ నిధులను రెండు రాష్ట్రాలు ఉపయోగించలేదు. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈరోజు జరిగే సమావేశంలో గత దశాబ్ద కాలంగా వేల కోట్ల బ్యాంకు డిపాజిట్లపై చర్చించనున్నారు.
9వ షెడ్యూల్లో చేర్చబడిన కంపెనీలు AP Gen Co. దీని ఖరీదు రూ.2,448 కోట్లుగా నిర్ధారించారు. కొన్ని సంస్థలకు 10వ ప్రణాళిక కింద రూ.2,994 కోట్లు నిధులు ఇవ్వగా, రెండు తెలుగు రాష్ట్రాలు ఈ నిధుల్లో రూ.1,559 కోట్లు పంచుకున్నాయి. రూ.1,435 కోట్ల చెల్లింపులపై పంచాయతీ కసరత్తు చేస్తోంది. ఈ అంశంపై కూడా నేటి సమావేశంలో చర్చించనున్నారు. చట్టంలో పొందుపరచని సంస్థల విభజనపై చంద్రబాబు, రేవంత్ లు ఇవాళ నిర్ణయం తీసుకోనున్నారు.
సంగారెడ్డి జిల్లా జన్నారం మండల పరిధిలోని వావిలాల గ్రామ శివారులో జయలక్ష్మి ట్రేడర్స్ ముసుగులో అక్రమ రేషన్ బియ్యం దందా కొనసాగుతుందని స్థానికులు ఆరోపిస్తున్నారు.వివిధ ప్రాంతాల్లో నుంచి కొనుగోలు చేసిన రేషన్ బియ్యాన్ని ఈ గోదాం ద్వారానే క్రియా విక్రయాలు కొనసాగిస్తున్నారని ఆరోపిస్తున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా ఈ అక్రమ రేషన్ దందా యధేచ్ఛగా కొనసాగుతున్న.. ఇప్పటివరకు ఏ ఒక్క అధికారి చర్యలు తీసుకోలేదని ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఇలాంటి అక్రమ వ్యవహారాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
దక్షిణ కొరియాలో ఆశ్చర్యపరిచే సంఘటన చోటు చేసుకుంది. ఇక్కడి గుమి నగర కౌన్సిల్ కార్యాలయంలో సేవలందించే ఒక రోబో.. కౌన్సిల్ భవనం మెట్లదారిపై ధ్వంసమై పడిపోయింది. అయితే, రోబో ఆత్మహత్య చేసుకుందనే ప్రచారం జరుగుతున్నది. రోబో దానికదే మెట్లపై నుంచి కింద పడిందని, ఇందుకు కారణాలు తెలియాల్సి ఉందని అధికారులు చెప్తున్నారు. దీంతో దక్షిణ కొరియా వాసులు రోబో ఆత్మహత్య చేసుకుందని చెప్తూ సోషల్ మీడియాలో విచారం వ్యక్తం చేస్తున్నారు.
అయితే, ఈ ఘటనకు ముందు రోబో.. ఏదో వెతుకుతున్నట్టుగా అటూఇటూ తిరుగుతున్నదని ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. ఈ ఘటనపై విచారణ జరుపుతామని, ముక్కలైన రోబో భాగాలను దానిని తయారుచేసిన కంపెనీకి పంపిస్తామని అధికారులు తెలిపారు.
దక్షిణ కొరియాలో రోబోలను విరివిగా వాడుతుంటారు. కాలిఫోర్నియాకు చెందిన ఓ కంపెనీ తయారుచేసిన ఈ రోబోను 2023 అక్టోబరు నుంచి గుమి నగర కౌన్సిల్లో వినియోగిస్తున్నారు. అధికారులకు డాక్యుమెంట్లు అందించడం, ప్రజలకు సమాచారం ఇవ్వడం వంటి పనులు చేసేది. కాగా, గతంలో వాషింగ్టన్లోనూ ఒక ఫౌంటెయిన్ వద్ద ఇదే రకంగా రోబో ధ్వంసమైంది. అప్పుడు కూడా రోబో ఆత్మహత్య చేసుకుందనే ప్రచారం జరిగింది. అయితే, అది జారిపడి ధ్వంసమైందని తర్వాత విచారణలో వెల్లడైంది.
వర్షాల కారణంగా అమర్నాథ్ యాత్రను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు అధికారులు శనివారం ప్రకటించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తగా ఈ నిర్ణయం తీసుకున్నారు. రెండు మార్గాల్లోనూ యాత్రను నిలిపివేసినట్టు స్పష్టం చేశారు. బాల్తాల్, పహల్గాం మార్గాల్లో గత రాత్రి నుంచి వర్షాలు కురుస్తుండడంతో యాత్రికుల భద్రత నిమిత్తం ఈ చర్య తీసుకున్నట్లు వివరించారు.
ఇవాళ (శనివారం) భారీ వర్షాలు పడే అవకాశం లేదని, అయితే అక్కడక్కడా జల్లులు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేయడంతో అప్రమత్తతలో భాగంగా అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. అమర్నాథ్ ఆలయ గుహ, శేషనాగ్ శిఖరం వద్ద ఉష్ణోగ్రత గరిష్ఠంగా 15 డిగ్రీల సెల్సియస్ వరకు ఉంటుందని, ఇక రాత్రి సమయంలో ఉష్ణోగ్రతలు 5 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోవచ్చని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇక రాగల 4 రోజులలో పెద్ద వర్షపాతం ఉండదని, అయితే ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని పేర్కొంది.
కాగా 3,800 మీటర్ల ఎత్తులో సహజసిద్ధంగా ఏర్పడిన మంచు లింగాన్ని దర్శించుకునేందుకు భక్తులు ఈ ఏడాది కూడా పోటెత్తుతున్నారు. ఈ ఏడాది అమర్నాథ్ యాత్ర జూన్ 29న ప్రారంభమవగా ఇప్పటివరకు 1.50 లక్షల మంది భక్తులు దర్శించుకున్నారని అంచనాగా ఉంది. ఇక ఆగస్టు 19న యాత్ర ముగుస్తుంది. కాగా గతేడాది మొత్తం 4.5 లక్షల మంది యాత్రికులు శివలింగాన్ని దర్శించుకున్నారు.
మెదక్ జిల్లాలో చిరుత పులి టెన్షన్ నెలకొంది. మెదక్ జిల్లాలో చిరుత పులి అర్థరాత్రి కలకలం రేపింది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. అర్ధరాత్రి మెదక్ జిల్లాలో హావేలిఘనపూర్ (మం) నాగపూర్ గేటు వద్ద కారులో వెళ్తున్న ప్రయాణికులకు కనిపించింది ఈ చిరుత పులి. ఈ సందర్భంగా చిరుత పులి కదలికలను సెల్ ఫోన్ లో చిత్రీకరించి పోలీసులకు పంపారు ప్రయాణికులు. దీంతో మెదక్ జిల్లా హావేలిఘనపూర్ (మం) నాగపూర్ గ్రామస్తులు భయాందోళనలో ఉన్నారు. చుట్టు పక్కల గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీశాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. దీంతో… నాగపూర్ గ్రామస్తులు భయాందోళనలో ఉన్నారు. ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.
ముఖ్యమంత్రి చంద్రబాబుసహా పలువురు టీడీపీ నేతలు, వ్యాపారవేత్తలపై ఉన్న కేసులన్నీ సీబీఐ, ఈడీలకు అప్పగించేలా ఆదేశాలు జారీ చేయాలంటూ హైకోర్టులో ప్రజాప్రయోజనవ్యాజ్యం దాఖలైంది. స్వర్ణాంధ్ర పత్రిక ఎడిటర్ కొట్టి బాలగంగాధర్ తిలక్ ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. చంద్రబాబుతో పాటు మంత్రులు నారా లోకేశ్, పొంగూరు నారాయణ, కింజారపు అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు, వ్యాపారవేత్తలు లింగమనేని రమేశ్, వేమూరు హరికృష్ణ సహా మొత్తం 114 మందిని ప్రతివాదులుగా పేర్కొన్నారు.
స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం, మద్యం కుంభకోణం, ఏపీ ఫైబర్ నెట్ కుంభకోణం, అసైన్డ్ భూముుల కుంభకోణం, ఇసుకు కుంభకోణం, ఇన్నర్ రింగు రోడ్ అలైన్మెంట్లో అక్రమాలు తదితర స్కామ్‌లకు సంబంధించి దర్యాప్తు బాధ్యతలను సీబీఐ, ఈడీలకు అప్పగించాల్సిన అవసరం ఉందన్నారు. హోం శాఖ ముఖ్య కార్యదర్శి హరీశ్ కుమార్ గుప్తాను వ్యక్తిగత హోదాలో ప్రతివాదిగా పేర్కొన్నారు. నిష్పాక్షిక, పారదర్శక, వేగవంతమైన దర్యాప్తు కోసం కేసులను సీబీఐ, ఈడీకి అప్పగించాలని అభిప్రాయపడ్డారు.
‘‘ఫలితాలు వెలువడిన రోజున డీజీపీగా, పోలీసు బలగాలకు అధిపతిగా ఉన్న హరీశ్ కుమార్త గుప్తా సీఐడీలోని ఆర్థిక నేరాల విభాగానికి తాళాలు వేశారు. ప్రస్తుత ముఖ్యమంత్రి, ఇతర టీడీపీ నేతలపై నమోదైన కేసులను దర్యాప్తు చేస్తున్న అధికారులకు ప్రవేశాన్ని నిరాకరించారు. చంద్రబాబు తదితరులు అధికారంలోకి వస్తున్నారని గ్రహించి, ఆయా కేసులను దర్యాప్తు చేస్తున్న అధికారుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించారు. అంతేకాక, మధ్యాహ్నం 12.30 గంటలకు రహస్యంగా సాయుధులను అక్కడ మోహరించారు. కౌంటింగ్ జరుగుతుండగానే ఆర్థిక నేరాల విభాగం నుంచి అధికారులందరినీ వెళ్లిపోమ్మన్నారు. ఈ విషయాలన్నీ పత్రికల్లో వచ్చాయి. ఓ డీజీపీ ఈ విధంగా చేయడం చట్టవిరుద్ధం, ఏకపక్షం, దౌర్జన్యపూరితం’’ అని పిటిషనర్ తిలక్ పేర్కొన్నారు.
ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజు నుంచీ డీజీపీ, సీఐడీ అదనపు డీజీ తదితరులందరూ కూడా ఈ కేసుల విషయంలో ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని తిలక్ వివరించారు. ఈ కేసుల్లో దోపిడీ, ఈడీ ఇప్పటివరకూ చేసిన దర్యాప్తును చంద్రబాబు, ఇతర నేతలకు అనుకూలంగా నీరు గార్చేలా వ్యవహరిస్తున్నారని, ఈ పరిస్థితుల్లో హైకోర్టు ఈ కేసుల దర్యాప్తును సీబీఐ, ఈడీకి అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని ఆయన కోరారు. ఏపీ బెవరేజస్ కార్పొరేషన్ అప్పటి ఎండీ హోదాలో డి. వాసుదేవరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా సీఐడీ కేసు నమోదు చేసిందని తెలిపారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత కక్ష సాధింపు చర్యల్లో భాగంగా వాసుదేవరెడ్డిపై కేసు నమోదు చేశారన్నారు. ఇసుక కుంభకోణంపై ఫిర్యాదు చేసినందుకు గనుల శాఖ అప్పటి డైరెక్టర్ జి.వెంకట రెడ్డిపై కక్ష తీర్చుకుంటున్నారన్నారు. తమపై ఫిర్యాదు చేసిన వారందరిపై చర్యలు తీసుకుంటామని రెడ్ బుక్ పేరిట పలువురు అధికారులను వేధిస్తున్నారని తెలిపారు. ఈ విషయాలన్నింటినీ పరిగణలోకి తీసుకోవాలని ఆయన కోర్టును కోరారు.