హైదరాబాద్‌తో పాటు పలు జిల్లాలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఎల్లో అలర్ట్ జారీ చేసింది. పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది. ఉపరితల ఆవర్తనం, ఫియర్ జోన్ ప్రభావంతో తెలంగాణలో వర్షాలు కురుస్తున్నాయని వెల్లడించింది. నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయని… మరో 4 రోజుల్లో రాష్ట్రమంతా విస్తరిస్తాయని పేర్కొంది. నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదలడం, ఉపరితల ఆవర్తనం, షియర్ జోన్ ప్రభావంతో రెండు రోజుల పాటు దక్షిణ తెలంగాణ జిల్లాల్లో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.
శుక్రవారం జీహెచ్ఎంసీ పరిధితో పాటు, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాలో భారీ వర్ష సూచన ఉందని తెలిపింది. ఉరుములు, మెరుపులతో కూడిన బలమైన ఈదురు గాలులతో వర్షం పడవచ్చునని వాతావరణ శాఖ తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది.