Telangana High Court Notices : ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం షాక్ ఇచ్చింది. మేడ్చల్, జనగాం నియోజకవర్గాల ఎమ్మెల్యేలు చామకూర మల్లారెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డిలకు హైకోర్టు నోటీసులు ఇచ్చింది. వారి ఎన్నికను సవాలు చేస్తూ దాఖలైన వేర్వేరు పిటిషన్లలో హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఎన్నికల నామినేషన్ సందర్భంగా తప్పుడు వివరాలతో అఫిడవిట్ సమర్పించిన మల్లారెడ్డి ఎన్నికను రద్దు చేయాలని కోరుతూ కాంగ్రెస్ అభ్యర్థి తోటకూర వజ్రేష్ యాదవ్ పిటిషన్ వేశారు. దీనిపై జస్టిస్ జె.శ్రీనివారావు విచారణ చేపట్టగా, పిటిషనర్ తరఫు న్యాయవాది సిద్ధార్థ్ పోగుల వాదనలు వినిపించారు. రిటర్నింగ్ అధికారికి మల్లారెడ్డి తప్పుడు అఫిడవిట్ సమర్పించారని తెలిపారు.
Congress Election Petition on Malla Reddy : సూరారం గ్రామంలో కొంత భూమి ఉందని అఫిడవిట్లో పేర్కొన్నారని, రికార్డుల ప్రకారం అది ప్రభుత్వ భూమి లాగా ఉందన్నారు. మల్లారెడ్డి హిందూ అవిభాజ్య కుటుంబ పెద్దగా ఉన్నట్లు చెప్పారని తెలిపారు. బ్యాంకు ఖాతాలు లేవని అఫిడవిట్లో తెలిపారని వివరించారు. బ్యాంకు ఖాతాలు లేకుండా ఆదాయపు పన్ను రిటర్ను ఎలా దాఖలు చేస్తున్నారో వివరాలు వెల్లడించలేదని కోర్టుకు వివరించారు..