కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆంధ్రప్రదేశ్ పర్యటన వాయిదా పడింది. ఈనెల 8వ తేదీని ఆయన రాయలసీమలో పర్యటించాల్సి ఉండగా, కొన్ని అనివార్య కారణాల వల్ల పర్యటన వాయిదా పడినట్లు తెలుస్తోంది. ఆ రోజున అమిత్ షా కర్ణాటకలో పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారని తెలుస్తోంది. ఈనెల మూడో వారంలో అమిత్ షా ఆంధ్రప్రదేశ్‌కు వస్తారని, పర్యటనకు సంబంధించిన తేదీ త్వరలో ఖరారు అవుతుందని బీజేపీ నేతలు చెబుతున్నారు.
కాగా, ఈనెల 8న కర్నూలు, అనంతపురం జిల్లాలో పర్యటన ఉండేది. ఈ రెండు జిల్లాల్లో ఐదు కార్యక్రమాల్లో అమిత్ షా పాల్గొనాల్సి ఉండేది. ఉదయం ఉదయం 11:15 గంటలకు కర్నూలులో బహిరంగ సభకు హాజరై, మధ్యాహ్నం 1:30 గంటకు పార్టీ కార్యకర్తలతో కేంద్రమంత్రి సమావేశం, అలాగే సాయంత్రం 3 గంటలకు పుట్టపర్తిలో జరిగే బహిరంగ సభ, సాయంత్రం 4.30గంటలకు శ్రీ సత్యసాయిబాబా ఆశ్రమాన్ని సందర్శన, ఆపై సాయంత్రం 5 గంటలకు పుట్టపర్తిలో పార్టీ కార్యకర్తలతో కేంద్రమంత్రి అమిత్ షా సమావేశం ఉండేది. అయితే పలు కారణాల వల్ల ఈ పర్యటన వాయిదా పడింది.