ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బ్రిటన్ రాజు కింగ్ చార్లెస్-3తో ఫోన్ ద్వారా ప్రత్యేకంగా సంభాషించారు. బ్రిటన్ రాజుగా కింగ్ చార్లెస్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత.. ఆయనతో మోడీ మాట్లాడటం ఇదే మొదటిసారి.. ఈ సందర్భంగా ప్రధాని మోడీ బ్రిటన్ రాజుకు శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రధానమంత్రి కార్యాలయం ఈ విషయాన్ని మంగళవారం వెల్లడించింది. ప్రధాని మోడీ, కింగ్ చార్లెస్.. ఈ సందర్భంగా వాతావరణ సమస్యలు, జీవవైవిధ్య పరిరక్షణ, ఇంధన పరివర్తనకు ఆర్థిక సాయం కోసం వినూత్న పరిష్కారాల అన్వేషణ, పరస్పర ఆసక్తి ఉన్న అనేక విషయాలపై చర్చించినట్లు ప్రభుత్వం ఓ ప్రకటనలో వెల్లడించింది.
దీంతోపాటు జీ20కి భారత్ అధ్యక్షత, శిఖరాగ్ర సమావేశం ప్రాధాన్యతలను కూడా ప్రధాని మోడీ బ్రిటన్ రాజుకు వివరించినట్లు తెలిపింది. డిసెంబరు 1న భారతదేశం అధికారికంగా G20 అధ్యక్ష బాధ్యతలను చేపట్టిన విషయం తెలిసిందే. సెప్టెంబర్ 9, 10 తేదీల్లో జరిగే ఈ శిఖరాగ్ర సమావేశాన్ని విజయవంతం చేసేందుకు G20 నాయకులతో భారత్ సంభాషిస్తోంది. ఈ సమావేశానికి జీ20 నేతలతోపాటు.. పలు దేశాల ప్రతినిధులు హాజరుకానున్నారు. ఈ మేరకు ప్రధాని మోడీ కింగ్ చార్లెస్ తో ప్రత్యేకంగా మాట్లాడారు.ఈ సందర్భంగా ప్రధాని మోడీ.. డిజిటల్ పబ్లిక్ గూడ్స్ ప్రచారం, మిషన్ లైఫ్ – లైఫ్ స్టైల్ ఫర్ ఎన్విరాన్‌మెంట్ లక్ష్యాన్ని కూడా వివరించారు. దీని ద్వారా భారతదేశం పర్యావరణపరంగా స్థిరమైన జీవనశైలిని ప్రోత్సహించడానికి ప్రయత్నిస్తుందని తెలిపారు. కామన్వెల్త్ దేశాలు, వాటి మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేయడంపై కూడా ఇరువురు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. భారత్, బ్రిటన్‌ల మధ్య జీవన వారధిగా.. ద్వైపాక్షిక సంబంధాలను సుసంపన్నం చేయడంలో బ్రిటన్‌లోని భారతీయ సమాజం ప్రధాన పాత్ర పోషించడాన్ని ప్రశంసించినట్లు పీఎంఓ తెలిపింది.